సంస్థ పరిచయం

పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ, 1991వ సంవత్సరంలో ఆధ్యాత్మికమార్గంలోనికి ప్రవేశించి, 1993లో గురూజీగా శిక్షణ పొంది, దానిని అన్నివర్గాల వారికి సరళంగా, సులభంగా, సశాస్త్రీయంగా, ఉచితంగా అందించాలనే సత్సంకల్పంతో, తన ధర్మపత్ని శ్రీమతి సూర్యకుమారి మాతాజీ ప్రోత్సాహంతో, 1998 మార్చి 29 ఉగాది పర్వదినాన, విజయవాడను ప్రధానకేంద్రంగా చేసుకొని, ధ్యానమండలి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారం భించడం జరిగింది.

అప్పటినుండి ఆ దంపతులిరువురు నిర్విరామంగా కృషి చేస్తూ, సంస్థను అంచలంచెలుగా, దశలవారీగా అభివృద్ధిపధంలో కొనసాగించారు. గురూజీ దాదాపు 100 పుస్తకాలను రచించి ప్రచురించడం, 250కు పైగా ప్రవచనాలను రికార్డు చేసి విడుదల గావించడం, వివిధ రకాల శిక్షణా తరగతులను రూపొందించడం, గురువులు గురుకుల శిక్షణల ద్వారా గురూజీలను తయారుచేయడం, అలాగే మాతాజీ ఆధ్వర్యంలో 65కు పైగా భజనలు, భక్తిగీతాలు, మంత్రాలు, శ్లోకాల సీడీలను రికార్డు చేయడం, సమగ్రవిశ్వశక్తి యోగచికిత్స ద్వారా అన్నిరకాల రుగ్మతలకు మందులను తయారుచేసి ఉచితంగా అందించడం వంటి వినూత్న విధానాల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మోపదేశాల ద్వారా మంత్రాన్ని ఉపదేశించి లక్షలాదిమందికి బ్రహ్మ జ్ఞానాన్ని అందించడం జరిగింది.

2007వ సంవత్సరంలో ధ్యానమాలిక మాసపత్రికను ప్రారంభించి దానిని దశలవారీగా విస్తరిస్తూ ప్రస్తుతం 7 వేలమందికి పైగా చందాదారు లకు అందించడం జరుగుతుంది. దాదాపు 2,500 ధార్మికసంస్థలకు, దేవాలయాలకు, వృద్ధాశ్రమాలకు, ఇతర సేవాసంస్థలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. సంస్థ ఆధ్వర్యంలో అనంతపురంజిల్లా నార్పలలో అనాధలకు, పేదవర్గాల విద్యార్ధినీ విద్యార్ధులకు శ్రీసత్యసాయి యోగ విద్యానిలయం ద్వారా ఉచితంగా విద్యను, భోజనం, వసతిని అందించడం జరుగుతుంది. పుట్టపర్తిలో శ్రీసత్యసాయి సేవాసదన్, రాజమండ్రిలో శ్రీసాయిబృందావనంలతో పాటు, నంద్యాలజిల్లా మహానందిలో గురుకుల శిక్షణల నిర్వహణకు అనువుగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

సంస్థను అంతర్జాతీయస్థాయిలో విస్తరింపజేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను యోగాంధ్ర గా తీర్చిదిద్దాలనే బలమైన దృక్పధంతో, యోగవిశ్వ విద్యాలయం, యోగ పరిశోధనా కేంద్రం, యోగవిద్యాలయాలు, యోగ వైద్యశాలలు, గ్రామీణశిబిరాలు అవసరమనే భావనతో, భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి అండదండల కోసం, ఆశీస్సుల కోసం స్వామీజీ ఆశ్రయించడం జరిగింది. స్వామీజీ ఆదేశం మేరకు 2008లో సంస్థ పేరును శ్రీ సత్యసాయి ధ్యానమండలిగా మార్చడం జరిగింది.

అయితే 2020లలో  కోవిడ్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలకు విస్తరించడం వలన, ప్రత్యక్షంగా బ్రహ్మోపదేశాలు నిర్వహించే అవకాశం లేనందువల్ల, అప్పుడప్పుడు గురుకుల శిక్షణలను మాత్రమే నిర్వహించడం జరిగింది. అంతేగాక దురదృష్టవశాత్తూ 2021 ఆగష్టు-30వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన పూజ్య మాతాజీ శివైక్యం చెందడంతో సంస్థ “మనుగడను గురించి అనేక సందేహాలు తలెత్తాయి.

అయితే దాదాపు 10 నెలలు పాటు ఉభయరాష్ట్రాలలో దాదాపు 50 కేంద్రాలలో మాతాజీ దివ్యసంస్మరణ కార్యక్రమా లతోపాటు, ఆధ్యాత్మిక సదస్సులను కూడా నిర్వహించడం వలన సంస్థ పునాదులు పటిష్టంగానే ఉన్నాయని ఋజువైంది. 2024 మే నెలలో “సంకల్ప సిద్ధివ్రతం” అనబడే ప్రత్యేక గురుకుల శిక్షణను వీడియోల ద్వారా గురుశిష్య సంవాదంతో నవీన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రూపొందించి అందించడం వలన అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్ఫూర్తితో ప్రస్తుతం “అంతర్ముఖయోగం” అనే సాధారణ శిక్షణను వీడియోల ద్వారా రూపొందించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ శిక్షణకు హాజరైన వారిని తదుపరి “చిత్తశుద్ధియోగశిక్షణ”, “సత్యదర్శనయోగశిక్షణ”, “సంకల్పసిద్ధి యోగశిక్షణ”, “ఆత్మస్థితియోగశిక్షణ” వంటి గురుకుల శిక్షణలకు అనుమతించడం జరుగుతుంది. ఆత్మస్థితి యోగాన్ని జీవితానికి అన్వయించుకోగలిగితే అవధూతలుగా పరిణతి చెందగలుగుతారు.

భవిష్యత్తులో బాలబాలికలకు, యువతీయువకులకు, విద్యార్ధులకు, మహిళలకు ప్రత్యేకంగా శిక్షణాతరగతులను రూపొందించాలనే ప్రయత్నం జరుగుతుంది. మరొక కీలకాంశమేమిటంటే అన్ని శిక్షణలను ఉచితంగా అందించాలని నిర్ణయించడం జరిగింది. వాస్తవానికి ఉచితం అనే అంశానికి కొందరు విలువనివ్వకపోవచ్చు. అయినాసరే ఆధ్యాత్మికతను అన్నివర్గాలకు అందించాలనే భావనతో, ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే గురు శిష్యుల మధ్య ఆర్థికపరమైన అంశాలకు ఎటువంటి అవకాశం ఉండకూడదు. సంస్థ ఆదర్శ ప్రపంచ నిర్మాణ బాధ్యతను చేపడుతుంది కాబట్టి, ప్రపంచమే సంస్థ నిర్వహణ బాధ్యతను కూడా తప్పక స్వీకరిస్తుంది. అందువలన అంతర్ముఖయోగం అనబడే ఈ ప్రాధమిక శిక్షణను దిగ్విజయంగా పూర్తిగావించుకొని ఆ తదుపరి దశల వారీగా అన్నిశిక్షణలను పూర్తి చేసుకొని మిమ్ములను, మీ కుటుంబాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ… అభిలషిస్తూ….

శ్రీ సత్యసాయి ధ్యానమండలి
విజయవాడ.